ఖమ్మం:చండ్రుగొండ మండల ఎఫ్ఆర్ఓ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు ను గుత్తి కోయలు(ఆదివాసులు) గొడ్డలి,కత్తులతో దాడి చేసారు.దాడిలో గాయాలై రక్తస్రావం కావడంతో చికిత్స కొరకు ఖమ్మం తరలించారు.చికిత్స పొందుతూ శ్రీనివాసరావు మృతి చెందారు.వివరాలు ఇలా ఉన్నాయి.చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామం ఎర్రబోడులో ప్లాంటేషన్ మొక్కలను పరిశీలించడానికి శ్రీనివాసరావు ద్విచక్ర వాహనంపై వెళ్ళారు.ప్లాంటేషన్ లోని మొక్కలను పశువులు మేస్తుండడంతో పశువుల యజమానులైన గుత్తి కోయలను వారించారు.కోపోద్రిక్తులైన గుత్తి కోయలు కత్తులతో ఎఫ్ఆర్ఓ పై దాడి చేసారు.మరో అధికారి తప్పించుకుని అధికారులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.రక్తపు మడుగులో పడివున్న శ్రీనివాసరావు ను చండ్రుగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.తీవ్రమైన గాయాలు రక్తస్రావం కావడంతో మెరుగైన వైద్యం కొరకు ఖమ్మం తరలించారు.చికిత్స పొందుతూ శ్రీనివాసరావు మృతి చెందారు.శ్రీనివాసరావు స్వగ్రామం ఖమ్మం జిల్లా సింగరేణి మండలం ఇర్లపుడి.ఆయనకు భార్యా ఇద్దరు పిల్లలు ఉన్నారు.గతంలో జూలూరుపాడు రేంజ్ పరిధిలో ఇన్ చార్జ్ ఎఫ్ఆర్ఓ గా విధులు నిర్వహించారు.రాష్ట్ర స్థాయి ఉత్తమ అధికారిగా అవార్డును అందుకున్నారు. పోడు భూముల సమస్యే ప్రధాన కారణం:గతంలో పోడు సాగు చేసుకుంటున్న భూముల వివాదాలు ప్రధాన కారణంగానే దాడులు జరిగాయని ప్రజలు చర్చించుకున్నారు.ట్రెంచ్ కొట్టడం,పోడు భూములలో మొక్కులు నాటించడంతొ గుత్తి కోయలు ఆగ్రహంతో ఉన్నారని చర్చలు జరుగుతున్నాయి.
