భూముల సమగ్ర వివరాలతో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి

తెలంగాణ భూ పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్లు పాశం యాదగిరి, గాదె ఇన్నయ్య

జగిత్యాల తాజా కబురు ప్రతినిధి: రిపోర్ట్ -( ఫ్రీలాన్సర్ జర్నలిస్ట్ నాగిరెడ్డి రఘుపతి రెడ్డి)
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విధాల భూముల సమగ్ర వివరాలతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక శ్వేతపత్రం ప్రచురించాలని తెలంగాణ భూ పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్లు పాశం యాదగిరి, గాదె ఇన్నయ్య లు డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని వంటశాల బృందావన్ గార్డెన్స్ లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది ఎకరాల సర్కారు భూములు, సర్ఫేఖాస్ ఆస్థులు, పాయిగా భూములు, జాగీరులు, దేశం వదిలి పాకిస్థాన్ వెళ్లిన వారి ఏవేక్యూ ఆస్థులు, హిందూ దేవాదాయ భూములు, వక్ఫ్ ఆస్థులు, అటవీ భూములు, సీలింగ్ భూములు, చెరువు శిఖం భూములు, నాలా కబ్జాలు, కోర్టు వివాదాల్లోని భూముల వివరాలన్నీ గ్రామాల వారీగా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ఒక రెవెన్యూ గ్రామాన్ని, ఒక యూనిట్ లేక క్లస్టర్ గా ఏర్పాటు చేసి గ్రామసభ ఆధ్వర్యంలో వివరించి అన్ని సర్వే నెంబర్లకు, బై నెంబర్లకు హక్కుదారులను నిర్ణయించాలన్నారు. “గ్రామసభ”కు అత్యున్నత అధికారంగా నూతన చట్టం తీసుకురావాలన్నారు.అన్ని రకాల ప్రభుత్వ భూములను అసైన్ చేసే అధికారం “గ్రామసభ”కు ఉండేలా చట్టం చేయాలన్నారు.నూతనంగా సర్వే చేయడానికి కొత్త చట్టాన్ని ప్రజాభిప్రాయానికి అనుగుణంగా చట్టం చేయాలని సూచించారు.
“గ్రామసభ” ద్వారా నిర్ణయించిన భూముల వివరాలను మాత్రమే ధరణి పోర్టల్ లో నమోదు చేయాలన్నారు.
సర్వే డిపార్ట్మెంట్ ను పూర్తిగా ప్రక్షాళన చేసి అవసరమున్నంత మంది ఉద్యోగులను నియామకం చేయాలన్నారు.
ప్రభుత్వ భూముల్లో నేమ్ బోర్డులు ఏర్పాటు చేసి పూర్తి రక్షణ కోసం కంచె ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలన్నారు.
షెడ్యూల్ 5 లో ఉన్న అటవీ భూములకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలని, గవర్నర్ పర్యవేక్షణ చేయాలని తెలిపారు.
అన్ని రకాల ప్రభుత్వ భూములను కాపాడడానికి ప్రభుత్వం వెంటనే కర్ణాటక రాష్ట్రంలో ఉన్నట్టుగా (1972) “ల్యాండ్ ఆర్మీ” ని ఏర్పాటు చేయాలని తెలియజేశారు.

ఐపిసి సెక్షన్ 145 ప్రకారం భూవివాదాల్లో అతి ఉత్సాహంతో పోలీస్ జోక్యం చేసుకోకుండా కట్టడి చేయాలన్నారు. భూవివాదాలన్నింటిని పర్యవేక్షించే అధికారం భూ పరిపాలన (ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్) శాఖకు అప్పగించాలన్నారు.
గజిబిజిగా ఉండి భూ ఆక్రమణలకు, ల్యాండ్ మాఫియాకు ఉపయోగపడుతున్న 127 భూ చట్టాలను ఒకేఒక సమగ్ర చట్టంగా సమీకృతం చేయాలన్నారు.నూతన సర్వే చట్టం ద్వారా డ్రోన్ లతో సహా నూతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి లొసుగులకు వీలులేని సర్వే ద్వారా గణాంక వివరాలు చేయాలన్నారు. భూవివరాలను తారుమారు చేయడానికి వీలు లేకుండా “బ్లాక్ చైన్” వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించు కోవాలన్నారు.అన్ని రకాల అసైన్ భూములకు ఆదివాసీ అటవీ భూములకు రైతుబంధు ఇవ్వాలని కోరారు. గ్రానైట్ క్వారీలను నిలిపి వేసి పర్యావరనాన్ని పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ విలేఖరుల సమావేశంలో తెలంగాణ భూ పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్లు పాశం యాదగిరి, గాదె ఇన్నారెడ్డి లతో పాటు రాష్ట్ర నాయకులు, ప్రముఖ న్యాయవాది డొంకెన రవి, దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి మార్వాడి సుదర్శన్, తుడుం దెబ్బ నాయకులు గుర్రాల రవి,మెరుగు కుమారస్వామి, డాక్టర్ కస్తూరి విశాల్, ప్రజా సంఘాల జేఏసీ జగిత్యాల జిల్లా చైర్మన్ అడ్డగట్ల గంగాధర్, అంబేద్కర్ యువజన సంఘం బుగ్గారం మండల అధ్యక్షులు నక్క చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here