హైదరాబాద్:తెలంగాణ తెలుగుదేశం పార్టీలో సంచలనం.పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ కండువా మార్చుకోనున్నారా?గులాబీ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నా రా?అంటే అవుననే సమాధానమొస్తోంది.రమణకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి పార్టీలోకి చేర్చుకునేందుకు గులాబీ బాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.ఈ మేరకు ఎల్.రమణతో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది.త్వరలో ఇద్దరి మధ్యా మరో భేటీ జరగనుంది.ఇప్పటికే రమణతో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడారు.పద్మశాలి సామాజికవర్గానికి చెందిన ఎల్.రమణకు బీసీ వర్గాల్లో మంచి గుర్తింపు ఉంది.ఈటల రాజీనామాతో ఖాళీ అయిన బీసీ నాయకుడి స్థా నాన్ని మరొక బీసీ నేతతోనే భర్తీ చేయడానికి టీఆర్ఎస్ అధిష్ఠానం వ్యూహ రచన చేస్తోంది.ఉమ్మడి ఏపీలో చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఎల్.రమణ రాష్ట్ర విభజన తర్వాత నుంచి టీటీడీపీ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు.ఎల్.రమణతో పాటు పలువురు టీడీపీ నాయకులు టీఆర్ఎస్‌లోకి వెళ్లనున్నారని సమాచా రం.ఈ నెల 3న ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి.కోవిడ్ కారణంగా వాటి ఎన్నికల ఆలస్యమవుతున్నాయి.ఈ నేపథ్యంలో ఎల్.రమణకు ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది.ఉత్తర తెలంగాణలో కీలకమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పట్టుకోల్పోకుండా ఉండేదుకు టీఆర్ఎస్ అధిష్ఠానం ప్రయత్నాలు మొదలుపెట్టింది.అందులో భాగంగానే ఏకంగా టీటీడీపీ అధ్యక్షుడిని తమ పార్టీలో చేర్చుకుంటోందని విశ్లేషకులు అంటున్నారు.