వైసీపీ రెబెల్స్‌పై రోజా షాకింగ్‌ కామెంట్స్‌-తొక్కిపారేశానంటూ-జగన్‌ జోక్యానికి వినతి

0
294

ఏపీలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల పోరులో వైఎస్సార్సీపీ సునామీ సృష్టిస్తున్న వేళ ఆ పార్టీకి చెందిన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్‌ ఎన్నికల పోరులో వైసీపీని ఓడించేందుకు ప్రయత్నించిన సొంత పార్టీ నేతలపై నిప్పులు చెరిగారు. నగరి నియోజకవర్గం పరిధిలోకి వచ్చే పుత్తూరు, నగరి మున్సిపాలిటీల్లో వైసీపీని ఓడించి తనను దెబ్బతీసేందుకు ప్రయత్నించిన నేతలపై ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. అంతే కాదు పార్టీలో ద్రోహులపై ఇప్పటికైనా సీఎం జగన్ చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు.

వైసీపీ ప్రభంజనం వేళ రోజా షాకింగ్‌ కామెంట్స్

ఏపీలో జరిగిన మున్సిపల్ పోరులో అధికార వైసీపీ ప్రభంజనం సృష్టిస్తున్న వేళ చిత్తూరు జిల్లా నగరి నియోజవర్గ ఎమ్మెల్యే, ఫైర్‌ బ్రాండ్‌ నేత ఆర్కే రోజా తన ప్రత్యర్ధులపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో వైసీపీలో ఉంటూ పార్టీని ఓడించేందుకు ప్రయత్నించిన నేతలపై రోజా నేరుగానే విమర్శలకు దిగారు. పార్టీలో వెన్నుపోటు దారులపై రోజా చేసిన వ్యాఖ్యలు వైసీపీని ఇరుకునపెట్టాయి. వైసీపీ హవాలో నగరి నియోజకవర్గం పరిధిలో ఉన్న పుత్తూరు, నగరి మున్సిపాలిటీలను దక్కించుకున్న తర్వాత రోజా చేసిన వ్యాఖ్యలు పార్టీలో సైతం సంచలనం రేపుతున్నాయి.

ప్రత్యర్ధుల్ని తొక్కిపారేశానన్న రోజా

వైసీపీలో ఉంటూ వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసిన ప్రత్యర్ధుల్ని తొక్కిపారేశానంటూ ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చిత్తూరు జిల్లాలో సైతం సంచలనం రేపాయి. ముఖ్యంగా పుత్తూరు, నగరి మున్సిపాలిటీల్లో వైసీపీని ఓడించడం ద్వారా సదరు నేతలు తనను దెబ్బతీసేందుకు ప్రయత్నించారంటూ రోజా ఆరోపించారు. వీరిపై గతంలోనూ విమర్శలు చేసిన రోజా… తాజాగా ఎన్నికల్లో గెలిచిన తర్వాత వారి ప్రయత్నాల్ని అడ్డుకున్నానంటూ చేసిన వ్యాఖ్యలు వైసీపీలో కొత్త చర్చకు తెరలేపాయి. చిత్తూరు జిల్లాలో తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న నేతలు తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నారంటూ రోజా గతంలో ఆరోపించారు.

ప్రత్యర్ధుల్ని మున్సిపల్‌ గేటు కూడా తాకనివ్వనంటూ

వైసీపీలో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై రోజా ఓ టీవీ ఇంటర్వూలో మాట్లాడుతూ సినిమా డైలాగులు వేశారు. ప్రత్యర్ధుల్ని మున్సిపల్‌ ఛైర్మన్‌ సీటు కాదు కదా మున్సిపల్‌ గేటు కూడా తాకనివ్వనంటూ రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో బాలకృష్ణ లెజెండ్ సినిమాలో వాడిన డైలాగ్‌ను రోజా తన ప్రత్యర్ధులపై ప్రయోగించారు. జగన్ హవా ముందు ప్రత్యర్ధుల ఆటలు సాగలేదని రోజా వ్యాఖ్యానించారు. పార్టీని, జెండాను అవామానించే ఎవరికీ పార్టీలో కొనసాగే హక్కు లేదంటూ ప్రత్యర్ధులపై రోజా విరుచుకుపడ్డారు.

రెబెల్స్‌పై చర్యలు తీసుకోవాలని జగన్‌కు వినతి

రాష్ట్రంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వైసీపీలో ఉంటూ వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసిన చీడ పురుగులపై చర్యలు తీసుకోవాలని ఆర్కే రోజా సీఎం జగన్‌ను కోరారు. ఇలాంటి వారి పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తే చాలా ప్రమాదమన్నారు. ఇలాంటి చీడ పురుగుల వల్ల పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు. ఇలాంటి వారికి ప్రజలు బుద్ధిచెప్పి నిజమైన వైసీపీ అభ్యర్ధులకు పట్టం కట్టడంపై రోజా సంతోషం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here