హైదరాబాద్:అర్ధరాత్రి ఓ ఆకతాయి చేసిన పనికి పోలీసులు అవాక్కయ్యారు.గురువారం రాత్రి 2 గంటల సమయంలో ఓ యువకుడు ‘డయల్ 100’కు కాల్ చేసి ‘సార్.. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను,మీరు రావాలి’అని కోరాడు.దీంతో డ్యూటీలో ఉన్న బ్లూకోల్ట్స్ కానిస్టేబుళ్లు,ఏఎస్‌ఐలు వెంటనే అతని వద్దకు బయలుదేరారు.తీరా అక్కడికి వెళితే ‘సార్..నాకు రెండు బీర్లు కావాలి’అని ఆ యువకుడు అనడంతో పోలీసులు విస్తుపోయారు.ఈ సంఘటన వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం గోకఫసల్‌వాద్ గ్రామంలో చోటుచేసుకుంది.పోలీసులు ఆ గ్రామానికి వెళ్లేసరికి ‘డయల్ 100’ కు ఫోన్ చేసిన జనిగెల మధు అనే యువకుడు మద్యం మత్తులో తూగుతున్నాడు.పైగా బీర్లు కావాలంటూ పోలీసులను ఆటపట్టించడానికి యత్నించాడు.దీంతో మధును పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు.100కు ఫోన్ చేసి తమ సమయం వృథా చేసిన మధుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రమేశ్ తెలిపారు.