హైదరాబాద్:రాష్ట్ర మంత్రివర్గం నుంచి మంత్రి ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేశారు.సీఎం కేసీఆర్ సిఫారసు మేరకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈటలను బర్త రఫ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.మెదక్ జిల్లాలోని అచ్చంపేట పరిధిలో భూకబ్జాలకు పాల్ప డ్డారనే ఆరోపణలపై సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.ఈ మేరకు బృందాలుగా ఏర్పడి మెదక్ జిల్లా అచ్చంపేటలో ఏసీబీ,విజిలెన్స్ అధికారులు విచారణ చేశారు.తూప్రాన్ ఆర్డీవో శ్యామ్ ప్రకాశ్ నేతృత్వంలో ఆరు ప్రత్యేక బృందాలతో ఈటలకు చెందిన హ్యాచరీస్ సహా పక్కనే ఉన్న అసైన్డ్ భూములపై డిజిటల్ స ర్వే నిర్వహించారు.తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మాసాయిపేట తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు.మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ విజిలెన్స్ విచా రణను పరిశీలించారు.కబ్జాకు గురైన భూముల్లో అసైన్డ్ భూమి ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని కలెక్టర్ తెలిపారు.నిన్న దర్యాప్తునకు సంబంధించిన పూర్తి ని వేదికను సీఎస్‌కు అందించారు.ఈటలపై వచ్చిన ఆరోపణలపై సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో శనివారం ఈటల నుంచి వైద్యఆరోగ్య శాఖను ప్రభుత్వం తప్పించింది.వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఈటలను తప్పించాలంటూ గవర్నర్ తమిళిసైకు సీఎం సిఫార్సు చేయగా ఆమె ఆమోదం తెలిపారు.ఆ శాఖను ముఖ్యమంత్రి తన వద్దే ఉంచుకున్నారు.ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ గెజిట్ నోటిఫికేషన్ సైతం విడుదల చేశారు.ఈటలను వైద్య ఆరోగ్య శాఖ నుంచి తప్పిం చిన వెంటనే ఆ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష జరిగి తన కార్యాలయంలో కార్యదర్శిగా ఉన్న రాజశేఖర్‌రెడ్డికి సమన్వయ బాధ్యతలు అప్పగించారు.తాజాగా ఈటలను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
